అమ్మో..కీసర!
Viewed:
282
Times | News ID:
S193311136
|
|
- Posted by
Sriman
on
6/1/2010 12:06:34 AM
in
Rangareddy
,
District News
|
కీసర: మండలంలో అప్రకటిత విద్యుత్‌కోత ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నది. పదిహేను రోజులుగా ఎడాపెడా కోతతో ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్నారు. కీసరలో రెండు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు గంటలు అధికారికంగా కోత విధించాల్సి ఉండగా మండలమంతా ఆరు నుంచి ఏడు గంటలు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి, అర్దరాత్రి కోత విధిస్తూ ట్రాన్స్‌కో వారు కీసర మండల ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నారు. కొత్తగా పెళ్లయి కీసర మండలంలో అత్తవారింటికి రావలసిన నూతన వధువులు ఇక్కడికి రావడానికి జంకుతున్నారు. పగలు రాత్రి తేడా లేని పవర్‌కట్ అత్తారింట్లోని మొదటి సమస్యగా వీరు ప్రస్తావిస్తున్నారు. ఇక కొత్త అల్లుళ్ల పరిస్థితీ అంతే.
మీ ఊళ్లో కరెంటు సరిగ్గా ఉండనే ఉండదు.. ఎవరూ ఇక్కడ పట్టించుకునే వారు లేరంటూ భోగారం, గోధుమకుంట గ్రామాల్లో ఇరువురు కొత్త అల్లుళ్లు అలిగి వెళ్లిపోయిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి. విద్యుత్ కోత కారణంగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ మంచినీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. రోహిణిలో రోకళ్లు పగిలే ఎండవేడిమికి తోడు ఎడాపెడా విద్యుత్ కోతతో చిన్నపిల్లలు తల్లిడిల్లిపోతున్నారు. మండల స్థాయి అధికారులు ఎవ్వరూ ఇక్కడ నివాసం ఉండని కారణంగా కరెంటు కోత కష్టాలు వారికి తెలియడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ కోత కారణంగా కీసరగుట్ట యాత్రికులకూ తిప్పలు తప్పడం లేదు. భక్తులకు సరిపడా నీటిసరఫరా చేయలేక ఆలయ అధికారులూ సతమతమవుతున్నారు. ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని, కనీసం ఈ రెండు రోజులైనా విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వాలని కోరినా ట్రాన్స్‌కో స్పందించిన పాపాన పోవడంలేదు. కీసరగుట్టపై అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు ఏడాది కాలంగా ఆ మాటే మర్చిపోయారు.
షాక్ వస్తున్నా .. ఆలయం పక్కన ఉన్న మంచినీటి కుళాయిలకు షాక్ తగులుతున్నా ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ లైన్లో ఎక్కడో ఎర్త్ ఏర్పడుతున్నా దాన్ని పరిశీలించడం లేదు. ఆదివారం సాయంత్రం కూడా గుట్టకు వచ్చిన భక్తులకు కుళాయిలు విప్పబోతుంటే స్వల్పంగా షాక్‌కు గురై ఆందోళనకు గురయ్యారు.
మౌనమే వీరి సమాధానం విద్యుత్ సమస్యలతో ప్రజలు ఓ వైపు అవస్థలు పడుతుంటే ట్రాన్స్‌కో అధికారులు మౌనం పాటిస్తున్నారు. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ అన్నసూక్తి ట్రాన్స్‌కో అధికారుల విషయంలో రివర్స్‌గా కనబడుతోంది. విద్యుత్ సమస్య గురించి తెలుసుకుందామని ప్రయత్నించిన వారు ట్రాన్స్‌కో అధికారులకు లోకువగా కనిపిస్తున్నారు. ట్రాన్స్‌కో ఏఈని కలిసినా ఎన్నిమార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించడంలేదని ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేగారూ.. స్పందించండి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యవైఖరితో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న కీసర మండల ప్రజల అవస్థలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. గంటల కొద్దీ విద్యుత్ కోతకు కారణాలేమిటి..? ప్రజల ఫిర్యాదులపై ట్రాన్స్‌కో అధికారులు ఎందువల్ల స్పందించడం లేదో తెలుసుకుని కరెంటు కష్టాల నుంచి విముక్తుల్ని చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
|