డాక్టర్లు ఉన్నట్టా.. లేనట్టా..
Viewed:
268
Times | News ID:
S189311129
|
|
- Posted by
Sriman
on
5/31/2010 11:59:33 PM
in
Nalgonda
,
District News
|
తుంగతుర్తి: తుంగతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. ఆస్పత్రిలో ఐదు డాక్టర్ పోస్టులు ఉండగా కాగితాలపై అన్ని పోస్టులు భర్తీ ఉన్నప్పటికీ ఆస్పత్రిలో మాత్రం ఒక్క డాక్టరూ లేరు. ఐదుగురిలో ఇద్దరు డాక్టర్లు డిప్యుటేషన్‌పై వెళ్లగా, ఒక డాక్టర్ ఉన్నత చదువుల కోసం సెలవులో ఉన్నారు. ఓ లేడీ డాక్టర్ ప్రసూతి సెలవులో ఉండగా, మరో డాక్టర్ భార్య ప్రసూతి కోసం సెలవుపై వెళ్లారు. ఇలా ఐదు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి.
ఆస్పత్రిలో ఓ దంత వైద్య నిపుణుడు ఉన్నప్పటికీ దంత వైద్యానికి సంబంధించిన పరికరాలు ఆస్పత్రిలో లేకపోవడంతో ఆయనకు తోచినప్పుడు ఆస్పత్రికి వచ్చి వెళుతుంటారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు హెల్త్ అసిస్టెంట్ చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్ చెడిపోయి ఎనిమిది సంవత్సరాలైనా దానిని మరమ్మతు చేసే నాథుడే లేడు. ఎక్స్‌రే తీసే రేడియోగ్రాఫర్, డార్మెట్రి అసిస్టెంట్లకు నెలనెలా వేలాది రూపాయల వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వానికి చెడిపోయిన ఎక్స్‌రే మిషన్ మరమ్మతు చేయించి వారి చేత పని చేయించాలన్న స్పృహ లేకుండా పోయింది. ఆస్పత్రిలో ఉండాల్సిన 30, 40 మంది స్టాఫ్‌లో ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో అర్థం కాని పరిస్థితి.
ఆస్పత్రి ఉన్నా వైద్యం చేసే నాథుడు లేక కరువు కాలంలో రోగాలు నయం చేయించుకోవడానికి అప్పులు చేసి చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లక తప్పడం లేదని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి డిప్యుటేషన్లను రద్దు చేసి, డాక్టర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే చెడిపోయిన ఎక్స్‌రే మిషన్ మరమ్మతు చేయించాలని, దంత సంబంధ వ్యాధుల పరీక్షలకు అవసరమైన పరికరాలు సమకూర్చాలని కోరుతున్నారు.
|
|
|