అయ్యో.. బిడ్డా...
Viewed:
145
Times | News ID:
28101877
|
|
- Posted by
Ranadheer
on
8/18/2012 5:37:41 PM
in
Khammam
,
Crime News
|
చండ్రుగొండ: సుదూరప్రాంతంలో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటున్న కుమారుడు అందనంత లోకాలకు తరలిపోయాడన్న వార్త విన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రుల వేదన అంతాఇంతా కాదు. వారం రోజుల నుంచి కంటిమీద కునుకు, తిండితిప్పలు లేకుండా ఉన్న వారికి కొడుకు మృతదేహం చూడగానే శోకం కట్టలుతెంచుకు వచ్చింది. నవ్వుతూ వెళ్లినవాడివి ఇలా వచ్చావా బిడ్డా అంటూ బంధువులు విలపిస్తుంటే....ఇంత అన్యాయం చేశావా అంటూ మిత్రులు ఘొల్లుమన్నారు.
అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో ఈనెల 10వతేదీన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన గాదె ఫణీంద్ర(28) అంత్యక్రియలు చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో శుక్రవారం జరిగాయి. జిల్లా నలువైపుల నుంచి వచ్చిన జనం ఫణీంద్రకు అంతిమ వీడ్కోలు పలికారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఫణీంద్ర తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విదితమే. శుక్రవారం 11 గంటల సమయంలో ఫణీంద్ర మృతదేహం దామరచర్లచేరుకుంది. ఫణీంద్ర మృతదేహం వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న గ్రామానికి చెందిన రైతులు, కూలీలు తమ పనులు మానుకుని నిరీక్షించారు. మండల వాసులు వందలాదిగా తరలివచ్చి నివాళులు అర్పించారు.
కుప్పకూలిన తల్లిదండ్రులు...
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు విగతజీవుడై ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఫణీంద్ర తల్లిదండ్రులు శివప్రసాద్, స్వర్ణలు కుప్పకూలిపోయారు. వారంరోజులుగా నిద్రహారాలు లేకుండా గడుపుతున్న వారు శవమై కొడుకు ఇంటికి రావడం జీర్ణించుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.
ప్రముఖుల పరామర్శ
ఫణీంద్ర మృతదేహాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మేల్యేలు కూనంనేని సాంబశివరావు, సండ్ర వెంకటవీరయ్య, మాజీమంత్రి కోనేరు నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చెర్మైన్ చేకూరి కాశయ్య, తెలుగుయువత రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని), కోనేరు పూర్ణచందర్రావు, కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, డెరెక్టర్ కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పురుశోత్తం, ప్రముఖ న్యాయవాదులు వలివెల వెంకటేశ్వరరావు, రావి విజయ్కమార్, కె పుల్లయ్య, రాంమూర్తి, ఉషారాణి, రాధాకృష్ణమూర్తి, కాసుల వెంకట్, జివికె మనోహర్ మండల ప్రముఖులు కొడకండ్ల వెంకటరెడ్డి, భోజ్యానాయక్, కోటగిరి రమణారావు, ఇంజం గోపాలరావు, కాపుగంటి సత్యబాబు తదితరులు ఫణీంద్ర కుటుంబసభ్యులకు పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సంతాపం
ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నూతలపాటి నాగేశ్వరరావు, నాయకులు నెల్లూరి నర్సింహారావు, కోమటి లింగమూర్తి, సాధినేని భాస్కర్రావు, మేదరమెట్ల స్వరూపరాణి ఫణీంద్ర మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
|
|
|