కూతురు ప్రేమపెళ్లి చేసుకుందని కుల బహిష్కరణ
Viewed:
135
Times | News ID:
279717229
|
|
- Posted by
Ranadheer
on
8/17/2012 12:59:14 PM
in
Warangal
,
Crime News
|
రూ.15 వేల జరిమానాతో తిరిగి కులంలో కలుపుకున్న పెద్దమనుషులు
సంగెం : గతంలో ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న పంచాయితీలను పరిష్కరించేందుకు పెద్దమనుషులు నిజాయితీగా వ్యవహరించి తీర్పు చెప్పేవారు. కానీ, ఇటీవల కొన్ని గ్రామాల్లో పెద్దమనుషుల ఆగడాలు శ్రుతిమించి పోతున్నాయనడానికి మండలంలోని గాంధీనగర్లో జరిగిన సంఘటనే నిదర్శనం. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి బతుకు దెరువు కోసం ఏడు సంవత్సరాల క్రితం షోలాపూర్ వెళ్లాడు. అతడి కూతురు అక్కడ ఓ యువకుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది.
ఇటీవల కుటుంబ సభ్యులంతా సొంతూరుకు వచ్చారు. ప్రేమ వివాహం విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని కులం నుంచి బహిష్కరించారు. ఎవ రు ఆ కుటుంబాన్ని విందులు, వినోదాలకు పిలవొద్దని... వారింటికి కూడా ఎవరూ వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. ఆందోళన చెందిన సదరు కుటుంబ సభ్యులు కుల పెద్దమనుషుల ను ఆశ్రయించారు. కనికరించిన పెద్దమనుషులు రూ.20 వేలు చెల్లిస్తే కులంలో కలుపుకుంటామని చెప్పారు. అంత డబ్బు ఇచ్చుకోలేమని బాధితులు బతిమిలాడగా రూ.15 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. దీంతో వారు అక్కడిక్కడ అప్పుతెచ్చి రూ.15 వేలు ముట్టజెప్పారు.
ఆ డబ్బుతో విందు చేసుకున్న పెద్దమనుషులు ఇక నుంచి సదరు కుటుంబాన్ని కులంలో కలుపుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఇలా ఎన్నో కుటుంబాలు గ్రామాణీ ప్రాంతాల్లో ఇప్పటికీ కులవివక్ష, మూఢాచారాలకు గురై అన్యాయమవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించాల్సిన అధికారులు, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం మరో కారణంగా పేర్కొంటున్నారు.
|
|
|