అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
Viewed:
255
Times | News ID:
27612725
|
|
- Posted by
R.R Reddy
on
12/12/2010 8:55:59 PM
in
Warangal
,
Crime News
|
చిట్యాల: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జడల్పేట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని బావుసింగ్పల్లికి చెందిన సింగం వెంకటేశ్వర్లు(30)కు జడల్పేటకు చెందిన మెట్టు సంజీవరావు కుమార్తె అంజలితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు(2)ఉన్నాడు. వివాహం సమయంలో రూ.2లక్షలు, ఎకరంన్నర భూమి వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.
ఏడాది పాటు ఎలాంటి గొడవలు లేకుండా కాపురం సజావుగా సాగింది. అయితే వెంకటేశ్వర్లుకు ఇచ్చిన భూమి పక్కనే సంజీవరావుకు 20 గుంటల భూమి ఉండడంతో సాగునీరు పోయే విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. గొడవ జరగడం పెద్దమనుషులు పంచాయితీ చేయడం రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. దీనిని జీర్ణించుకోలేని వెంకటేశ్వర్లు దసరా పండగ ముందు భార్య అంజలితో గొడవపడ్డాడు. దీంతో ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల నుంచి తన భార్యను తిరిగి పంపించడం లేదని వెంకటేశ్వర్లు ఆవేదన చెందేవాడు. భార్యను తీసుకురావడానికి శుక్రవారం అత్తగారింటికి వెళ్లాడు.
కాపురానికి రావాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది అక్కడే క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కోసం వెళ్లిన తన కుమారుడిని అత్త, మామ, భార్య కలిసి బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించి చంపారని మృతుడి తల్లి లక్ష్మీ ఆరోపించింది. ఒక్కగానొక్క కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని తెలిపింది. సీఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని సందర్శించి గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
|
|
|