ఐటీఐ విద్యార్థులకు లెక్చరర్ కుచ్చుటోపీ!
Viewed:
139
Times | News ID:
24621226
|
|
- Posted by
Ranadheer
on
7/12/2012 12:36:50 PM
in
Medak
,
Crime News
|
సిద్దిపేట టౌన్: సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు సీట్లు ఇప్పిస్తానని ఓ లెక్చరర్ విద్యార్థులకు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ సంఘటన బుధవారం సిద్దిపేటలో వెలుగుచూసింది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం మాడెపల్లికి చెందిన పాండు, వరంగల్ జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన నవీన్‌కుమార్, చేర్యాలకు చెందిన భాస్కర్‌రెడ్డి, సురేందర్, ఎండీ యాసీన్, సుధాకర్‌లు రెండు సంవత్సరాల క్రితం సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రానిక్ కోర్సు చదవడానికి వచ్చారు. అప్పడు ఆ కోర్సుకు డిమాండ్ ఉండడంతో సీటు లభించలేదు.
ఆ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్న ముజీబ్ వారి వద్దకువచ్చి డబ్బులు ఇస్తే కోరిన సీట్లు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వారు రూ.ఐదు వేల చొప్పున చెల్లించారు. పది రోజుల తరువాత ముజీబ్ చేర్యాలకు వెళ్లి మరో రూ.10 వేలు ఇస్తే సీట్లు పక్కా అవుతాయని నమ్మించాడు. స్టాంప్ పేపర్‌పై హ్యాండ్ లోన్ తీసుకున్నట్లు రాసిచ్చి డబ్బులు వసూలు చేశాడు. కానీ విద్యార్థులకు సీట్లు మాత్ర ఇప్పించలేదు. అప్పటి నుంచి సదరు కాంట్రాక్ట్ లెక్చరర్ కనిపించలేదు. బుధవారం అతను సిద్దిపేటలో ఉన్నాడని తెలుసుకున్న బాధిత విద్యార్థులు స్థానిక టీటీడీ కల్యాణ మండపం ఎదుట ముజీబ్ వెళ్తు న్న కారును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అతను దురుసుగా మాట్లాడుతూ కారును వేగంగా తొలుతూ పారిపోయాడు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న విలేకరుల ఎదుట విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
పోలీసుల అదుపులో కాంట్రాక్ట్ లెక్చరర్
ఇదిలా ఉండగా సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లుగా భావిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ ముజీబ్‌ను అదుపులోకి తీసుకున్నామని సిద్దిపేట పట్టణ వన్‌టౌన్ సీఐ నాగభూషణం చెప్పారు. అతను ఏ విధంగా విద్యార్థులను మోసం చేసిన విషయంపై విచారణ జరుపుతున్నామన్నారు.
|
|
|