అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
Viewed:
132
Times | News ID:
199516040
|
|
- Posted by
Ranadheer
on
6/16/2012 11:10:42 AM
in
Nalgonda
,
Crime News
|
రాజాపేట: మండలంలోని పారుపల్లి గ్రామంలో రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పారుపల్లి గ్రామానికి చెందిన దార్ల భిక్షపతి గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకూ ఇంటికి రాలేదు. ఆయన భార్య సత్తమ్మకు పాల సొసైటీలో సభ్యత్వం ఉంది. శనివారం గ్రామంలో సొసైటీ డెరైక్టర్ ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల గురించి చర్చించేందుకు బాలయ్య ఎవరింటికో వెళ్లి ఉంటాడని, అందుకే ఇంటికి రాలేమోదని కుటుంబ సభ్యులు భావించారు. శుక్రవారం ఉదయం కూడా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందారు. మధ్యాహ్నం గ్రామానికి చెందిన రైతు దార్ల బాలయ్య వ్యవసాయ పనుల కోసం తన బావి వద్దకు వెళ్లాడు. పొలంలో భిక్షపతి మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
కుటుంబ సభ్యులు, బంధువులు భిక్షపతి మృతదేహం వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిం చారు. తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. భిక్షపతికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి వివాహం జరిగింది. మూడవ కుమార్తె డిగ్రీ పూర్తిచేయగా, చిన్న కుమార్తె బీటెక్ చదువుతున్నది. తండ్రి అకస్మాత్తుగా మృతిచెందడంతో వారు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
పిడుగుపాటే ప్రాణం తీసిందా?
మృతదేహం వద్ద గడ్డి మోపు ఆధారంగా భిక్షపతి గురువారం గడ్డి కోసం పొలానికి వచ్చాడని భావిస్తున్నారు. అప్పుడు వర్షం కురవడంతో తలదాచుకునేందుకు తాడి చెట్టుకిందికి వెళ్లగా పిడుగుపాటుకు గురై మృత్యువాత పడి ఉంటాడని గ్రామస్తులు అనుకుంటున్నారు. అయితే పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల నేపథ్యంలో హత్య చేశారేమోనని కొందరు అనుమానిస్తున్నారు.
|
|
|