జోరుగా జీరో బియ్యం దందా
Viewed:
133
Times | News ID:
199016035
|
|
- Posted by
Ranadheer
on
6/16/2012 11:05:41 AM
in
Nalgonda
,
Crime News
|
నల్లగొండ) నిన్నటి దాకా రైతు ధాన్యం కొనేందుకు లెక్కలేని కారణాలు చూపిన మిల్లర్లు నేడు లెక్కకు మించి బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రజావసరాల కోసం ఉపయోగించే లెవీ బియ్యం కోటా భర్తీకి కుంటి సాకులు చెప్పిన వ్యాపారులు వేల టన్నులు జీరో లెక్కలో తరలిస్తున్నారు. నిఘా వేయాల్సిన అధికారులు, సిబ్బందికి పచ్చనోట్లు ఎర వేసి యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.
రైతుకు క్వింటా ధాన్యానికి రూ.900లకు మించి చెల్లించని మిల్లర్లు నేడు వాటిని బియ్యంగా మలిచి క్వింటా రూ.3150లకు అమ్మి దండిగా దండుకుంటున్నారు. ఒక క్వింటా పేరు మీద వెయ్యికిపైగా బొక్కుతున్నారు. ప్రధానంగా మిర్యాలగూడ నుంచి భారీగా ఈ దందా కొనసాగుతోంది. అక్కడ నుంచి ప్రతిరోజూ అర్ధరాత్రి 70 నుంచి 80 లారీల బియ్యం ఇతర ప్రాంతాలకు రవాణా అవుతోంది. ఇక మిల్లుల్లో స్టాక్ బోర్డ్‌లో చూపుతున్న నిల్వలకు వాస్తవ నిల్వలకు ఏ మాత్రం పొంతన లేకపోవడం గమనార్హం.
సాధారణంగా చెక్‌పోస్టుల్లో వే బిల్లు, పర్మిట్‌ను తనిఖీ చేసి వాటిపై ముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి చెక్ పోస్టులోనూ అక్కడి సిబ్బందికి లారీకి రూ.150 చెల్లిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌లో ధాన్యం దిగుమతి చేసి తెల్లవారే సరికి సంబంధిత లారీ జిల్లాకు చేరుకుంటుంది. జీరో సరుకు రవాణా చేసిన డ్రైవర్‌కు రూ.1300 అదనపు భత్యం కింద నజరానాగా చెల్లిస్తున్నారు. నిఘా అధికారులు, చెక్ పోస్ట్ సిబ్బందిని 'మేనేజ్' చేయడంతో... అధికారులు పట్టుకునే వరకు ఒకే వే బిల్, పర్మిట్‌పై సరుకు రవాణా చేస్తుంటారు. ఈ పద్ధతిలో వివిధ రకాల పన్నుల నుంచి మిల్లర్లు తప్పించుకుని ఆ మేర కాసులు జేబుల్లో వేసుకుంటున్నారు. నిఘా అధికారుల కళ్లు కప్పేందుకు కింది రెండు వరుసలు జీరో బియ్యం, పై రెండు వరుసలు లెవీ బియ్యంతో రవాణా చేస్తున్నారు.
ఇలా జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నైలకు లారీల ద్వారా తరలిస్తున్నారు. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు నౌకా మార్గం ద్వారా జీరో సరుకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారం నడిపేందుకు మిర్యాలగూడకు చెందిన కొందరు వ్యాపారులు దుబాయ్‌లోనే మకాం వేసి చక్రం తిప్పుతున్నారు. నెల రోజులుగా జిల్లా నుంచి పెద్ద ఎత్తున జీరో బియ్యం సరిహద్దులు దాటుతోంది. రెండు సంవత్సరాల క్రితం మిర్యాలగూడ, కోదాడ,సూర్యాపేటల్లోని కొన్ని మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి భారీగా అక్రమ నిల్వలు గుర్తించారు. షిప్యార్డ్లలోనూ పెద్ద సంఖ్యలో జీరో బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
|
|
|