రూ.5.50 కోట్టకు గ్రహణం
Viewed:
160
Times | News ID:
14024227
|
|
- Posted by
Ranadheer
on
6/4/2012 12:57:30 PM
in
Rangareddy
,
District News
|
(రంగారెడ్డి అర్బన్) ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న గ్రామ పంచాయతీ లకు ఆయుపట్టులా భావించే 13వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు విడుదలయ్యే అవకాశం కన్పించడం లేదు. ఫిబ్రవరి, మార్చిలో విడుదలు కావాల్సిన ఈ నిధులపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉన్నవాటితోనే ఏదోలా కాలం వెళ్లదీయాలని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలే నిధులు కొరత, ప్రత్యేక అధికారుల అస్తవ్యస్త పాలనతో కునారిల్లుతున్న పంచాయతీల్లో చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కా రం అవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. జిల్లాకు 2011- 12 ఆర్థిక సంవత్సరంలోని రెండో విడత రూ. 5.50 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది.
పంచాయతీలకు పాలకవర్గాలు ఉన్నట్లయితే ఈ నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంజూరు చేయించుకునే వారు. మళ్లీ కొత్త పాలకవర్గాలు ఏర్పడితేనేకాని ఈ నిధులు విడుదలయ్యే అవకాశంలేదు. జిల్లాలో మొత్తం 705 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.వాటిలో ఏడు మేజర్ గ్రామ పంచాయతీలు, మిగతావన్నీ మైనర్ పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని పంచాయతీలు ఉన్నా ఆర్థికంగా నిలుదొక్కుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలు నిధులు లేక చతికిలపడ్డాయి. అటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధులు ప్రధాన ఆధారం. ప్రస్తుతం అవి కూడా విడుదల కాకపోవడంతో గ్రామాల్లో చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదు.
ప్రధానంగా 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పారిశుధ్యం, తాగునీటి పనులు అటకెక్కాయి. ఈ నిధులను గ్రాప పంచాతీయల్లోని జనాభా ప్రాతిపదికన కేటాయిస్తూ, ఏటా రెండు విడతల్లో విడుదల చేస్తుంది. అయితే పంచాయతీలకు పాలక వర్గం ఉన్నట్లయితే సర్పంచ్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ నిధులను మంజూరు చేయించుకునే వారు. పాలకవర్గాలు లేనందున రూ. 5.50 కోట్ల నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. గత ఏడాది ఆగస్టు 22న పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో పారిశుధ్యం, తాగునీటి సమస్యలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
ఈ నిధులు వీటికి తప్ప మరే పనులకు వినియోగించరాదు. పంచాయతీలకు పాలకవర్గాలు ముగిసినప్పటి నుంచి పంచాయతీల్లోని మురుగు కాలువల్లో పూడికలు పేరుకున్నాయి. ప్రత్యేకాధికారులు ఉన్నా వీటి జోలికి వెళ్లడంలేదు. కాలువల్లో బ్లీచింగ్ పనులు నిలిచిపోయాయి. బోర్లు, నల్లాలు, పైపు లైన్లు మరమ్మతులు చేసే దిక్కు లేదు. స్థానిక సమస్యలపై పట్టించుకునే నాథుడే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి, పైపులైన్లు, విద్యుత్ కనెక్షన్లు మరిచారు. ఈ నిధులు ఉన్నట్లయితే ఆ ట్యాంక్ వద్దకు పైపులైన్లు వేసినట్లయితే ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడేవి.
అయితే జిల్లాలో జెడ్పీ సా«ధారణ నిధులు రూ. 8 కోట్లతో గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు కేటాయించారు. వేసవిలో ప్రజల గొంతు తడిపేందుకే ఈ నిధులు సరిపోతున్నాయి. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే మార్గాలు ఉన్నప్పటికీ నిధుల కొరతతో అమలు జరగడం లేదు. పంచాయతీల్లో బోర్లు ఎండిపోయాయి. మోటర్లు కాలిపోయాయి. వీటికి మరమ్మతులు చేసేందుకు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న కొన్ని పంచాయతీలు తప్ప మిగతావి సమస్యల సుడిగుండలో కొట్టుమిట్టాడుతున్నాయి.
|
|
|