పోలీసులు అసమర్థత వల్లే సంఘటనలు పునరావృతం
Viewed:
147
Times | News ID:
12782057
|
|
- Posted by
Ranadheer
on
6/2/2012 11:27:03 AM
in
Adilabad
,
Crime News
|
ఉట్నూర్, జూన్ 1 : జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో పోలీసులు విఫలం అవుతుండడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆరోపించారు. మండలంలోని మారుతి గూడకు చెందిన గిరిజన బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన అనంతరం శుక్రవారం కమిటీ సభ్యులు ఆత్రం భుజంగ్‌రావు, కొండల రెడ్డి, మర్సుకోల తిరుపతి, ఆత్రం సుగుణలు గ్రామాన్ని సందర్శించి బాధితులను కలిసి వివరాలు సేకరించారు. బాలికతో పాటు గ్రామస్థులను, బాధితురాలి తల్లితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దంతన్‌పల్లికి చెందిన మహేష్, కిషోర్, సురేష్‌లు గిరిజన బాలికపై పథకం ప్రకారమే అత్యాచారం జరిపి పంచాయతీలో డబ్బుల ద్వారా కేసు నుంచి విముక్తులు కావాలని కుయుక్తులు చేశారని అన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన గిరిజన బాలిక అత్యాచార ఉదంతంపై పోలీసులు ఇప్పటికైన పకడ్బందీగా వ్యవహరించి దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2010లో కొత్తగూడ సమీపంలోని వ్యవసాయ బావిలో గిరిజన బాలికలు ఇద్దరు అత్యాచారం అనంతరం హత్యకు గురైన ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదన్నారు.
ఇటీవల నార్నూర్ జాతర సమయంలో రాజులగూడాకు చెందిన గిరిజన మహిళపై గిరిజనేతరులు అత్యాచారం చేశారని, అదే మాదిరి గంగాపూర్ గోండుగూడకు చెందిన గిరిజన బాలికపై అత్యాచారం జరిపి చెట్టుకు ఉరి వేసుకుని మరణించినట్లు చిత్రీకరించి హత్య చేశారని ఈ సంఘటనలో కూడ పోలీసులు దోషులను పట్టుకోవడంలో విఫలం అయ్యాయన్నారు. జైనూర్, కెరమెరి, సిర్పూర్(యూ), ఉట్నూర్ మండలాల్లో గిరిజన మహిళలపై రోజురోజుకూ అత్యాచార సంఘటనలు జరుగుతున్న పోలీసులు అదుపు చేయడంలో విఫలం అయ్యాయన్నారు. అత్యాచారం జరిగిన బాధితులను పరామర్శించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదని, అత్యాచారం చేసిన గిరిజనేతరులకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనల సమయంలో పంచాయతీలు చేసి డబ్బులకు కక్కుర్తి పడే నాయకులకు దేహశుద్ది చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైన జిల్లా పోలీసులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
|
|
|