కలకలం
Viewed:
178
Times | News ID:
111931037
|
|
- Posted by
Ranadheer
on
5/31/2012 11:07:13 AM
in
Adilabad
,
Crime News
|
ప్రకంపనలు సృష్టిస్తున్న వ్యాపారి వ్యవహారం
ఐపీ దాఖలు చేసే దిశలో ప్రయత్నాలు
బజారుకెక్కుతున్న బాధితులు
రూ.250 కోట్ల రికవరీపై బ్యాంకర్ల కుస్తీ
అధికారుల తీరుపై అనుమానాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ప్రముఖ వ్యాపార సంస్థల అధినేత దివాళా అంశం చర్చనీయాంశంగా మారింది. ‘ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు’గా ఆస్తులను వెల్లడించి నజరానాలతో బ్యాంకుల్లో భారీ మొత్తంలో రుణాలు పొందిన సదరు వ్యాపారి ఎగవేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. బ్యాంకులకు సుమారుగా రూ.250 కోట్లు చెల్లించాల్సిన వ్యాపారి మార్కెట్లో రూ.2 వడ్డీపై మరో రూ.50 కోట్ల వరకు చిరు వ్యాపారులు, రైతుల, అడ్తీదారులు, కమీషన్ ఏజెంట్ల నుంచి అప్పులు పొందినట్లు తెలిసింది. సదరు వ్యాపారి లావాదేవీలు నెల రోజులుగా స్తంభించడంతో అనుమానం వచ్చిన బ్యాంకర్లు రంగంలోకి దిగడంతో అసలు విషయం పడినట్లు తెలిసింది. ఆదిలాబాద్‌లోని ఓ బ్యాంకు రూ.624 కోట్ల రుణాలిస్తే, అందులో దివాళా తీసిన వ్యాపారి సంస్థలకు రూ.250 కోట్ల మేరకు అప్పులు ఇచ్చారు. రైతులు, మహిళా సంఘాలకు రుణాలిచ్చే విషయంలో నిబంధనలు ఏకరువు పెట్టే బ్యాంకు అధికారులు వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో ‘నజరానా’లు పుచ్చుకుని పరిమితులు దాటి రుణాలిచ్చి తలలు పట్టుకుంటున్నారు.
ఐపీ దాఖలుకు యత్నం..
జిన్నింగ్, సోయాబీన్, ఆయిల్ మిల్లు తదితర వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న సదరు వ్యాపారి ఇన్సాల్వెన్సీ పిటిషన్(ఐపీ) దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఓ వైపు చిరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు ఐపీ దాఖలు చేసేందుకు ఆదిలాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఆదిలాబాద్‌లో నంబర్ వన్ వ్యాపార సంస్థలుగా పేరున్న వ్యాపారి కుమారులు ఇటీవలే ఆస్తుల పంపకాలు చేసుకోగా, ఆ తర్వాతే దివాళా తీసిన వ్యవహారం బయటకు పొక్కడం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా వుండగా ఓ ప్రముఖ వ్యాపారి రూ.300 కోట్ల మేరకు ఆర్థికంగా నష్టపోవడం జిల్లాలో ఇదే ప్రథమం కాగా, సదరు వ్యాపారి దివాళా తీశాడన్న సమాచారంతో రూ.2 వడ్డీకిచ్చిన చిరు వ్యాపారులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు ఆయన ఇంటి ముందు బారులు తీరుతున్నారు. వ్యాపారితో సత్సంబంధాలున్న కొందరు వ్యాపారులు ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దే యత్నం చేస్తుండగా, కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండటం వివాదాస్పదం అవుతోంది.
వ్యవసాయ భూములపై రూ.కోట్ల రుణాలు..
వ్యాపారికి బ్యాంకర్లు వ్యవసాయ భూములపైన కూడా పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తెలిసింది. పదేళ్ల క్రితం సుమారుగా ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించి ఆదిలాబాద్, తాంసి, భైంసా, బేల, తలమడుగు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములను కొనుగోలు చేశారు. జిన్నింగ్ మిల్లు, సోయాబీన్, ఆయిల్ మిల్లులపై కాకుండా వ్యవసాయ భూముల విలువను పెంచేసి రూ.కోట్లల్లో సదరు వ్యాపారి రుణాలు పొందినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎకరానికి రూ.15 వేలు వెచ్చించి కొనుగోలు చేసిన భూములపై ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు అధికారులు కొందరు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఓ సంస్థకు గాని, వ్యక్తికి గాని బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చే ముందు ఫీల్ట్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాల్సి ఉంది.
అయితే ఈ క్రమంలో సదరు వ్యాపారి పెద్ద మొత్తంలో ‘నజరానా’లు ఎర వేసినట్లు సమాచారం. కార్లు, ప్లాట్ల రూపంలో కూడా కొందరు వ్యాపారులు కానుకలు పొందినట్లు ప్రచారం ఉంది. రైతులు, మహిళా సంఘాలకు రుణాలిచ్చేందుకు సవాలక్ష నిబంధనలను సాకుగా చూపే అధికారులు ఒక బ్రాంచి నుంచి రూ.624 కోట్ల మేరకు రుణాలిస్తే.. ఒకే వ్యాపారికి రూ.250 కోట్ల మేరకు అప్పులిచ్చారంటే ఏ మేరకు ‘అమ్యామ్యాలు’ పుచ్చుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి దివాళా వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, రూ.250 కోట్లను రికవరీ చేసుకునేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు ఆ వ్యాపారి ఆస్తుల వివరాలు సేకరిస్తుండటం కలకలం రేపుతోంది.
|
|
|